గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లు లోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆధ్వర్యంలో గురువారం నుంచి రెండు రోజుల పాటు మెటీరియల్స్ జీనోమ్ పై అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 16 దేశాలకు చెందిన 140 మంది శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు పాల్గొంటున్నారు. ప్రొఫెసర్ రంజిత్ థాపా కన్వీనర్ గా దృశ్యమాధ్యమ పద్ధతిలో జరిగే ఈ సదస్సును ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రొ-వైస్ ఛాన్సలర్ ఆచార్య డి నారాయణరావు ప్రారంభించనున్నారు. మెటీరియల్ సైన్స్ పై ఎదురవుతున్న వివిధ రకాల సవాళ్లను పరిష్కరించడానికి దోహదపడే కీలక నిర్ణయాలు, ఆలోచనలను పరస్పరం చర్చించుకునే దిశగా సదస్సును నిర్వహించనున్నట్లు ఆచార్య డి. నారాయణరావు పేర్కొన్నారు.
రెండు రోజుల సదస్సులో మొత్తం 53 మంది శాస్త్రవేత్తలు తమ అనుభవాలను పంచుకోనున్నారనీ, మలేషియా, రష్యా, చైనా, జర్మనీ, జపాన్, థాయ్లాండ్, సౌదీ అరేబియా, సౌత్ కొరియా, తైవాన్, యునైటెడ్ కింగ్డమ్, యూఎస్ఏ, సింగపూర్, ఇరాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, భారత్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు మెషీన్ లెర్నింగ్, హై త్రూపుట్ కంప్యూటేషన్, ఆక్సిజన్ ఇవాల్యూషన్ రియాక్షన్, ఆక్సిజన్ రిడక్షన్ రియాక్షన్ వంటి కీలక అంశాలపై ప్రసంగించనున్నారని సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ రంజిత్ థాపా పేర్కొన్నారు. బెంగళూర్ లోని ఇండియన్ సైన్స్ అకాడమీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఉమేష్ వాగ్మరే, ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్ డైరెక్టర్ తనుశ్రీ సహదాస్ గుప్తాలు ముఖ్య వక్తలుగా సదస్సులో కీలక ఉపన్యాసాలు ఇవ్వనున్నారని వివరించారు. సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వజ్జా సాంబశివరావు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa