ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిశ వాహనాలని ప్రారంభించిన సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 03:56 PM

సచివాలయం ప్రధాన గేటు వద్ద దిశ పెట్రోలింగ్‌ వాహనాలను బుధవారం సీఎం జగన్ జండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ రోజు దేవుడి దయతో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. దిశ డౌన్‌లోడ్స్‌ నేడు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1 కోటి 16 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతిలో దిశ యాప్‌ ఉందన్నారు. దాదాపుగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో అంటే దాదాపు ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్‌ పనిచేస్తుందన్నారు. వీటన్నింటితో ఒక గొప్ప విప్లవానికి, ఒక మార్పుకు శ్రీకారం చుడుతున్నామని, ఎక్కడైనా ఒక అక్కచెల్లెమ్మ మీద ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం ఊరుకోదు అన్న సంకేతం పంపిస్తున్నామన్నారు.


ఒక్క సామాన్య అక్కచెల్లెమ్మలే కాదు పోలీసు వృత్తిలో ఉన్న అక్కచెల్లెమ్మలకూ మంచి చేసే దిశగా అడుగులు పడ్డాయని, ఇంతకుముందు పోలీస్‌ స్టేషన్‌లలో అక్కచెల్లెమ్మలకు ప్రత్యేకంగా రెస్ట్‌రూమ్‌ ఉండేది కాదని, నేడు ప్రతి పోలీస్‌ స్టేషన్‌లోనూ మహిళలకు ప్రత్యేకంగా వాష్‌రూమ్‌లు ఉండటంతో పాటు బందోబస్తుకు వెళ్లినప్పుడు కూడా అక్కచెల్లెమ్మలకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా వాష్‌రూమ్స్, డ్రెస్సింగ్‌ రూములు ఉండే విధంగా. 18 కార్‌ వాన్స్‌ను కూడా ప్రారంభిస్తున్నామన్నారు. మొత్తం 30 కార్‌వాన్స్‌ ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ 18 వచ్చాయని వాటిని ప్రారంభిస్తున్నామన్నారు. మరో 12 రాబోయే రోజుల్లో వస్తాయని ఈ రోజు కార్‌వాన్స్‌తో పాటు 163 దిశ పోలీస్‌ ఫోర్‌వీల్‌ వాహనాలను కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 900 దిశ ద్విచక్రవాహనాలు వివిధ పోలీస్‌ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయని వాటికి అదనంగా 163 పోర్‌వీలర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.


ఇవి కాక ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న. ప్రతి వాహనాన్ని అంటే దాదాపు మూడువేల వాహనాలను జీపీఎస్‌ ట్యాగింగ్‌ చేసి, దిశకు అనుసంధానం చేసి వాటన్నింటినీ కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. ఏదైనా ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మ తన ఫోన్‌ను ఐదుసార్లు అటూ, ఇటూ ఊపితే చాలు. 10 నిమిషాలలోనే ఆ అక్కచెల్లెమ్మ దగ్గరకు మన పోలీస్‌ సోదరుడు వెళ్లి. చెల్లెమ్మా నేను నీకు తోడుగా ఉన్నాను. ఏమిటి నీ సమస్య అని అడిగే గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టామన్నారు. ఆ రెస్పాన్స్‌ టైం. 10 నిమిషాలు. అంటే సంఘటన జరిగిన 10 నిమిషాలలోపే కచ్చితంగా అక్కడకు రావాలి అని గట్టిగా నేను చెప్పానని, డీఐజీ పాలరాజు, డీజీపీ రాజేంధ్రనాథ్‌ రెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఈ విషయంలో బాగా కృషి చేశారన్నారు. అందరూ కలిసికట్టుగా ఆ రెస్పాన్స్‌ టైంను ఇంకా కుదించి. ఇంకా వీలైనంత త్వరగా 10 నిమిషాలలోపే అందుబాటులో ఉండే పరిస్థితి రావాలి అనే ఉద్ధేశ్యంతో ఈ వాహనాలను ప్రారంభిస్తున్నామన్నారు.


దిశకు సంబంధించి డీజీపీ రాజేంద్రనాద్‌రెడ్డి, డీఐజీ పాలరాజకు మరొక్కసారి హామీ ఇస్తున్నానని దిశ యాప్‌ కోసం, పనితీరును మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తరపునుంచి ఎటువంటి సహకారం కావాలన్నా కూడా అన్నిరకాలుగా ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు దీనివల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ. ఇంకా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ. జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని సీఎం వైయస్‌. జగన్‌ తన ప్రసంగం ముగించారు. కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్‌ కె మోషేన్‌ రాజు, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీఐజీ పాలరాజు, దిశ స్పెషల్‌ ఆఫీసర్‌ కృతికా శుక్లా, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa