ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో భారీగా పెరగనున్న కరెంట్ కోతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 06:09 PM

ఏపీలో భారీగా విద్యుత్ కోతలు అమలు అవుతున్నాయి. ఇష్టానుసారంగా కరెంట్ కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు పవర్ హాలీడేను ప్రకటించారు. ఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఉన్న 253 ప్రాసెసింగ్‌ పరిశ్రమలు కేవలం 50 శాతం విద్యుత్‌ మాత్రమే వాడుకోవాలని సీఎండీ సూచించారు. 1,696 పరిశ్రమలకు వారంలో ఒక రోజు పవర్‌ హాలీడే ప్రకటించినట్లు ఆయన చెప్పారు. వీక్లీ హాలీడేకు అదనంగా ఒక రోజు పవర్‌ హాలిడే పాటించాలని పరిశ్రమలను యాజమాన్యాలకు సీఎండీ కోరారు. ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు రెండు వారాల పాటు పరిశ్రమలకు పవర్‌ హాలీడే అమలులో ఉంటుందని హరనాథరావు తెలిపారు.

మరోవైపు కరెంట్ కోతలతో సామాన్య ప్రజానీకం అల్లాడిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 10 నుంచి 12 గంటల పాటు కరెంట్ కోతలు విధిస్తున్నారని సమాచారం. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రిలో కరెంట్‌ లేక పసికందులతో బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనరేటర్‌ వేయాలన్నా డీజిల్ లేదంటూ చేతులెత్తేశారు ఆస్పత్రి సిబ్బంది.

ఇక నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలోనూ ఎమర్జెన్సీ ఆపరేషన్స్‌ కూడా చేయలేని పరిస్థితి. గర్భిణులకు కూడా చీకట్లోనే డెలివరీ చేయాల్సి వస్తోందని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 40 నుంచి 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. పవర్ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక అధికారులు, ప్రభుత్వం చేతులెత్తేసినట్టు సమాచారం.

ఇప్పటి వరకు కూడా సీఎం జగన్ విద్యుత్ డిమాండ్, సప్లై కూడా సమీక్ష చేయలేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు విమర్శించారు. ఇది విద్యుత్ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాస్ చేతగానితనానికి నిదర్శనమని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa