పదహారో నంబరు జాతీయరహదారి సర్వీసు రోడ్డు ప్రక్కన ఆనవాలు లేకుండా పూర్తిగా కాలిపోయిన మహిళ మృతదేహం పడి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. యడ్లపాడు నుంచి చిలకలూరిపేట వెళ్లే మార్గంలో నక్కవాగు, ఉప్పువాగు మధ్యలో సర్వీసు రోడ్డు పక్కన 90శాతం పైగా కాలి ఎముకలు మిగిలిన గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని ఆదివారం మధ్యాహ్నం గుర్తించారు. శనివారం అర్దరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగి ఉండవచ్చని, మృతురాలి వయస్సు సుమారు 25-30 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆమెను ఎక్కడైనా హత్యచేసి ఆనవాళ్ళు లేకుండా ఇక్కడ దగ్ధం చేశారా అనే కోణంలో విచారిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు, రూరల్ సీఐ సుబ్బారావులు సందర్శించి వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించిన ఏదైనా ఆచూకీ తెలిసిన వారు 9440796268ను సంప్రదించాలని సీఐ కోరారు. హత్యకేసుగా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.