పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనాయణకు నూతన మంత్రివర్గంలో చోటు లభించింది. ఈయన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలు కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. కొట్టు వెంకటేశ్వరరావు, సరస్వతిల ప్రధమ కుమారుడు కొట్టు సత్యనారాయణ. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరు మండలం గోపీనాధపట్నం మంత్రి కొట్టు సత్యనారాయణ స్వగ్రామం.
వ్యాపారం నిమిత్తం తాడేపల్లిగూడెం నివాసం వచ్చారు. మంత్రి కొట్టు సత్యనారాయణ 1994లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1994లో కాంగ్రెస్ లో చేరారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి సారిగా తెలుగుదేశం పార్టీకి చెందిన పనల కనకనుందరరావుపై కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. 1999లో కాంగ్రెస్ పార్టీ తరపున టి. డి. పి. అభ్యర్ధి యర్రా నారాయణ స్వామిపై పోటీ చేసి ఓటమి చెందారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన పనల కనకనుందరరావుపై ఘన విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గా మరలా పోటీ చేసిన ఆయన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధి యీలి నాని చేతిలో ఓటమి చెందారు. 2014లో జరిగిన రాజకీయ సమీకరణ నేపథ్యంలో పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెంకు కేటాయించిన బి. జె. పి. అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు పై స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి యీలి నాని పై, వై. ఎస్. ఆర్. సి. పి. పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణ గెలుపొందారు.
ముఖ్యమంత్రి వై. యఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం నూతన మంత్రివర్గంలో కొట్టు సత్యనారాయణకు మంత్రిగా అవకాశం లభించింది. మంత్రి పదవి లభించిన కొట్టు సత్యనారాయణకు భార్య సౌదామణి, ఇద్దరు కుమారులు విశాల్, బాల రాజేష్, కుమార్తె కాంచన్ కలరు. 1955లో జన్మించిన కొట్టు సత్యనారాయణ ఇంటర్ వరకు విద్యాభ్యాసం పూర్తిచేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి కొట్టు సత్యనారాయణకు మంత్రి పదవి కేటాయించడంతో నియోజకవర్గంలో వై. సి. పి. శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెల్లువిరుస్తున్నాయి.