ఒక్కోసారి అభిమానులు ఆకాశనెత్తడమే కాదు...అదే ఆకాశం నుంచి కిందకు కూడా పడేస్తారు. ఇదిలావుంటే సన్ రైజర్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్ ఆసాంతం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ప్రశాంతతను కోల్పోయి, అసహనంగా కనిపించాడు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ సీజన్ లో సన్ రైజర్స్ చేతిలో గుజరాత్ తొలి ఓటమిని చవిచూసింది. గుజరాత్ టైటాన్స్ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగానే సన్ రైజర్స్ సాధించేసింది.
13వ ఓవర్ లో హార్థిక్ పాండ్యా మరోసారి బౌలింగ్ చేయడానికి వచ్చాడు. కేన్ విలియమ్సన్ రెండు, మూడో బంతులను సిక్సర్లుగా మలిచాడు. విలియమ్సన్ పార్ట్ నర్ గా ఉన్న త్రిపాఠి ఓవర్ చివరి బంతిని అప్పర్ కట్ తో సిక్సర్ గా మలిచే ప్రయత్నం చేశాడు. మహ్మద్ షమీ దాన్ని క్యాచ్ గా పట్టాల్సింది. కానీ నేలను తాకి షమీ చేతుల్లోకి వచ్చింది. దీంతో పాండ్యాకు మంటపుట్టింది. షమీపై అరుస్తున్నట్టు కెమెరాలు రీప్లే చూపించాయి. దీంతో ‘నీవు కెప్టెన్ గా పనికిరావు’ అంటూ సామాజిక మాధ్యమాల్లో క్రికెట్ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. ‘‘హార్థిక్ నువ్వు ఒక భయంకరమైన కెప్టెన్. సహచరులపై అరవడం మానుకో. కనీసం సీనియర్లు అయిన షమీ వంటి వారి విషయంలో అయినా’’ అని మరొక క్రికెట్ లవర్ కామెంట్ పెట్టాడు.