ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో అత్యధికంగా సాగు చేసే పండ్ల తోటల్లో బత్తాయిది మొదటి స్థానం. గత కొన్ని రోజులుగా బత్తాయికి మంచి ధర లభిస్తుండటంతో రైతులు ఆనందంగా ఉన్నారు.కోవిడ్-19తో మూడేళ్లుగా లాక్ డౌన్ అమలులో ఉండటం, రవాణా సౌకర్యం లేకపోవడంతో బత్తాయి రైతులు అల్లాడిపోయారు. తాము పండించిన కాయలు స్థానికంగానే అరకొర ధరకు అమ్ముకోవాల్సివచ్చింది. కూలీల ఖర్చులు కూడా రావన్న ఉద్దేశంతో అనేక మంది రైతులు పంటను పొలాల్లోనే వదిలి వేసిన సంఘటనలు చాలా చోట్ల ఉన్నాయి. గతేడాది కొంత మేరకు బత్తాయికి ధర ఉన్నా రైతులు తమ పంటను ఆలస్యంగా మార్కెట్ తీసుకురావాల్సి వచ్చింది. ఈ సంవత్సరం సీజన్ ప్రారంభంలోనే బత్తాయి ధర దూకుడుగా ఉండడంతో పలువురు వ్యాపారులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ప్రారంభంలో ధర 35 వేలు ఉండగా ప్రస్తుతం రూ. 40 వేల వరకు ఉంది. ఈ నెలాఖరు నుంచి మే ప్రారంభంలో బత్తాయి రూ. 50 వేల వరకు ధర పలికే అవకాశం ఉందని, ఎండల తీవ్రత ఆధారంగా ధర మారుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఎనిమిది వేల ఎకరాల్లో సాగు..
జిల్లా (8 నియోజకవర్గాలు)లో ఎనిమిది వేల ఎకరాల్లో రైతులు బత్తాయి తోటలను పెంచుతున్నారు. ఎకరాకు 10 టన్నుల ప్రకారం మొత్తం 80 వేల టన్నుల బత్తాయి కాయలు దిగుబడి వస్తుంది. ప్రారంభ ధర నుంచి మే నెలాఖరు వరకు పలికిన ధరలు సరాసరిన టన్ను రూ.40 వేల ప్రకారం లెక్క కట్టినా ప్రకాశం బత్తాయి రైతులకు రూ.320 కోట్లు అందుతుందని సమాచారం.
ఇతర రాష్ట్రాలకు సరఫరా..
ఎర్రగొండపాలెం ప్రాంతం నుంచి కలకత్తా, ఢిల్లీ, ముంబై వంటి పట్టణాలకు రోజుకు రెండు లారీల ప్రకారం రవాణా అవుతున్నాయి. డిమాండ్ పెరిగే కొద్దీ దేశంలోని అన్ని ప్రాంతాలకు బత్తాయి కాయలను రవాణా చేస్తామని రైతులు పేర్కొంటున్నారు.
దిగుబడి బాగుంది -షేక్ నబీరసూల్, ఉద్యానవనశాఖాధికారి, ఎర్రగొండపాలెం
సకాలంలో వర్షాలు కురవడం, బోర్ల నుంచి నీరు వస్తుండటంతో ఈ సంవత్సరం బత్తాయి దిగుబడి బాగుంది. కోవిడ్ కారణంగా రైతులు తమ పంటను రవాణా చేసుకోలేక బాగా నష్టపోయారు. ఈ ఏడాది అటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం మంచి ధర పలుకుతోంది. మే నాటికి టన్ను రూ.50 వేలకు పైబడి ధర పలికే అవకాశం ఉంది.