దేశ రాజకీయాలు అనూహ్యంగా మలుపు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీలతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కూడా పాలుపంచుకున్న ఈ సమావేశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న వార్తలు కూడా ఈ భేటీపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
అయితే ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు... ప్రత్యేకించి పంజాబ్‌లో పార్టీ ఓటమికి గల కారణాలపై చర్చించేందుకే ఈ భేటీ జరిగినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పార్టీ అనుసరించాల్సిన వ్యూహాల బ్లూ ప్రింట్ రూపకల్పనపైనా ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లుగా ప్రచారం సాగుతోంది.