అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. దక్షిణ కరోలినాలోని రద్దీగా ఉండే షాపింగ్ మాల్లో తుపాకీతో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కొలంబియా సెంటర్లో శనివారం మధ్యాహ్నం జరిగిన కాల్పులకు సంబంధించి తుపాకీలను కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కొలంబియా పోలీస్ చీఫ్ డబ్ల్యు.హెచ్.హోల్బ్రూక్ తెలిపారు. ఘటన యాదృచ్ఛికంగా జరిగిందని తాము నమ్మడం లేదన్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే ఎనిమిది మంది బాధితులు గాయపడ్డారని చెప్పారు. వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆ ఎనిమిది మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఆరుగురి పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. బాధితులలో 15 ఏళ్ల నుంచి 73 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నారని తెలిపారు.