ప్రపంచాన్ని నేటికీ కరోనా వణికిస్తోంది. కొత్త వేరియంట్లు, సబ్ వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతోంది. భారత్‌లో కేసులు తక్కువగా ఉన్నాయని నిబంధనలను ఎత్తి వేశారు. అయితే ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడి చేసేందుకు దేశ జనాభాకు రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ అందించారు. మూడో వ్యాక్సిన్ కూడా పొందొచ్చని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ తరుణంలో కోవిడ్‌కు విరుగుడుగా కొత్తగా స్ప్రే రూపంలో మందును శాస్త్రవేత్తలు రూపొందించారు. కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకులు దీనిని తయారు చేశారు. తాము చేసిన ఈ స్ప్రేను పీల్చితే కరోనా దరి చేరదని చెబుతున్నారు. స్ప్రే చేయగానే అందులోని ఎన్-0385 అనే రసాయన ప్రభావం పని చేస్తుందని, అది వైరస్‌ను నాశనం చేస్తుందని పేర్కొంటున్నారు. ఒమిక్రాన్‌తో పాటు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్ల మీద కూడా అద్భుతమైన ప్రభావం కనబర్చిందని తెలిపారు. ఈ కొత్త ఆవిష్కరణపై ప్రపంచ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.