ప్రభుత్వ సంక్షేం పథకాలు పేదలకు చేరవేయడంలో వాలంటీర్ల సేవలు అభినందనీయమని మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని మంగళగిరి అర్బన్ కు సంబంధించిన వాలంటీర్లలో ఎంపికయిన వాలంటీర్లకు "సేవా పురస్కారాలు" బహూకరణ కార్యక్రమం మంగళగిరి పట్టణం ఈద్గా ఫంక్షన్ హాలు లో నగరపాలక సంస్థ కమిషనర్ యు. శారద దేవి అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన తో "మా తెలుగుతల్లి" గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంత రావు, ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మంగళగిరి, తాడేపల్లి తహశీల్దార్ లు జీ. వి. రామ్ ప్రసాద్, శ్రీనివాసరెడ్డి లు హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ప్రభుత్వ భాగస్వాములుగా ప్రభుత్వ పధకాలు సేవలు ప్రజలు వినియోగించుకోవడంలో ప్రభుత్వ అధికారులు ఉద్యోగులకు సహాయంగా ఉంటూ ప్రజలకు స్వచ్చందంగా సేవలు అందజేస్తున్న వాలంటీర్ సోదర, సోదరీమణుల సేవలను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల సత్కార కార్యక్రమము ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన రెడ్డి ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. కార్యక్రమములో భాగంగా నేడు నగరపాలక సంస్థ కు చెందిన మంగళగిరి నుండి ఎంపికై "సేవా వజ్ర", "సేవా రత్న", "సేవా మిత్ర" పురస్కారములు అందుకుంటున్న వాలంటీర్లకు శుభాభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. వాలంటీర్లు అందరు ఇదేవిధంగా నిజాయతీతో, నిబద్దతతో సేవలందిస్తూ నగరపాలక సంస్థ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు.
ఎమ్మెల్సీ మురుగుడు హనుమంత రావు మాట్లాడుతూ ప్రభుత్వ పధకాలు, సేవలు ప్రజల వద్దకు నేరుగా అందుబాటులోకి తీసుకుని రావటానికి, ప్రభుత్వ సేవల కొరకు కార్యాలయాల చుట్టూ తిరగకుండా అన్నీ తమ సమీపంలోనే పొందే విధంగా చేయుటకు, పధకాల అమలులో పారదర్శకత పాటించేందుకు ఒక సత్సంకల్పంతో వినూత్న రీతిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేయడం ఎంతో గొప్పవిషయమని అన్నారు. అనంతరం అతిధుల చేతుల మీదుగా వాలంటీర్లకు పురస్కార బహూకరణ సత్కార నిర్వహించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె. హేమ మాలిని, డిప్యూటీ కమిషనర్ సి. హెచ్. రవి చంద్రా రెడ్డి, ఎం. పి. డి. ఓ కె. రామ్ ప్రసన్న, నగరపాలక సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.