క్షణికానందం కోసం పరాయి వ్యక్తుల మోజులో పడిన వారి జీవితాలు విషాదకరంగా మారుతున్నాయి. వివాహేతర సంబంధాల కోసం కొందరు తమ కుటుంబాలను రోడ్డు మీదకు లాక్కుంటున్నారు. మరికొందరు అఘాయిత్యాలకు బలై, ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఓ వివాహితను ఆమె ప్రియుడు అర్థరాత్రి కడతేర్చాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కర్నాటకలోని మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకా ఆతగూరు హోబలి కెస్తూరు గ్రామంలో సుమ(38) అనే మహిళ నివసిస్తోంది. ఆమెకు పదో తరగతి చదువుతున్న కుమారుడు యోగేష్ ఉన్నాడు. ఆమె భర్త రాజణ్ణ గ్రామపంచాయతీలో 'గ్రూప్ డి' ఉద్యోగం చేసేవాడు. అయితే అతడు చెరువులో చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తూ మరణించాడు. దీంతో అతడి ఉద్యోగం భార్య సుమకు వచ్చింది. భర్త చనిపోయిన కొన్నాళ్లకు ఆమె ఓ వ్యక్తితో సన్నిహితంగా మెలిగింది. ఆమె ప్రియుడే శనివారం అర్ధరాత్రి వచ్చి, ఆమెను హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా కొప్ప గ్రామ సర్పంచి చంద్రహాస్ అనే వ్యక్తిపై 2017లో అత్యాచార యత్నానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తగిన సాక్ష్యాధారాలు లేవంటూ మండ్య కోర్టు ఆ కేసును కొట్టేసింది. దీంతో చంద్రహాస్‌కు ఆ కేసు నుంచి విముక్తి లభించింది. ఆమె ప్రియుడు అతడేనని, వివాదాల కారణంగా హతమార్చి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.