ఉక్రెయిన్‌పై విజయం సాధించేందుకు రష్యా మారణహోమం సృష్టిస్తోంది. చిన్న దేశమైన ఉక్రెయిన్‌ను 50 రోజులు దాటినా హస్తగతం చేసుకోలేక కుటిల యత్నాలకు పాల్పడుతోంది. తమకు మద్దతుగా సిరియా ఫైటర్స్‌ను రంగంలోకి దింపనుందనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో ప్రచురితం అయ్యాయి. సిరియా అంతర్యుద్ధంలో ఆ దేశ సైనిక దళాలకు రష్యా మద్దతుగా నిలిచింది. తిరుగుబాటుదారులను అణచివేసిన సిరియా బ్రిగేడియర్ జనరల్ సుహేల్ అల్ హసన్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా 2017లో ప్రశంసించారు. అల్ హసన్ దళాన్ని ‘టైగర్ ఫోర్స్’గా పిలుస్తుంటారు. గతంలో రష్యా అందించిన సహకారానికి మద్దతుగా ప్రస్తుతం ‘టైగర్ ఫోర్స్’ ఉక్రెయిన్‌తో పోరులో రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. టైగర్ ఫోర్స్‌కు చెందిన 700 మంది ఇటీవల సిరియా వదిలి వెళ్లారని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా 40 వేల మంది సిరియన్ సైనికులు రష్యా తరుపున యుద్ధంలో పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. తమ తరుపున యుద్ధంలో పాల్గొన్న సిరియా సైనికులకు నెలకు 600ల డాలర్లు రష్యా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.