యోగి రాజ్ పాలనలో యూపీలో ధారుణం చోటుచేసుకొంది. ఓ దళిత బాలుడిని కొందరు యువకులు దారుణంగా కొట్టారు. అంతేగాక, ఆ బాలుడితో తమ కాళ్లు నాకించుకుని పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్మార్ట్‌ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మైనర్ పై దాడి జరిగిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో చోటు చేసుకుంది.
ఆ దళిత బాధితుడు పదో తరగతి చదువుతున్నాడు. అతడి తల్లి నిందితుల్లోని ఒకరి పొలాల్లో కూలీగా పనిచేస్తోంది. తన తల్లి పనికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని ఆ విద్యార్థి అడగడంతో అతడిపై కొందరు యువకులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ బాలుడిని మొదట బెల్టుతో కొట్టారు. ఆ తర్వాత కూడా వదిలిపెట్టకుండా కాళ్లు నాకాలని నిందితులు డిమాండ్ చేశారు.
ఆ బాలుడు ఏడుస్తూ, తనను విడిచిపెట్టాలని కోరినా వినిపించుకోలేదు. ఆ సమయంలో భయపడిపోతోన్న ఆ దళిత బాలుడిని చూస్తూ అక్కడ ఉన్న ఇతరులు గట్టిగా నవ్వారు. ఇటువంటి తప్పు మరోసారి చేస్తావా? అని ఆ దళిత బాలుడిని ఆ యువకులు ప్రశ్నించారు. చేయబోనని ఆ బాలుడు కన్నీరు పెట్టుకున్నాడు. ఆ దళిత బాలుడు స్థానికంగా గంజాయి అమ్ముతున్నట్లు అక్కడి యువకులు కొందరు ఆరోపణలు చేశారు.
వాళ్లు కొట్టే దెబ్బలు తాళలేక ఆ ఆరోపణలను భయంతోనే ఆ దళిత బాలుడు అంగీకరించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ నెల 10వ తేదీన ఈ ఘటన జరిగిందని తెలిపారు. దళిత బాలుడు తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడని, అనంతరం వెంటనే నిందితులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. దళిత బాలుడిపై ఇటువంటి దారుణానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.