వైసీపీ పార్టీకి నెల్లూరు జిల్లా సొంత పార్టీ రాజకీయాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఏపీలోని నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఫ్లెక్సీల గొడవ మరింత ముదురుతోంది. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫ్లెక్సీ తొలగించిన ఘటనలో ఘర్షణ సద్దుమణిగిందనుకుంటుండగానే.. మరో ఘటన జరిగింది. నిన్న రాత్రి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మద్దతుదారులు నెల్లూరులోని ముత్తుకూరు రోడ్ సర్కిల్ లో ఫ్లెక్సీ పెట్టారు. అయితే, వాటిని ఎవరో చించేయడంతో ఆయన అనుచరులు మండిపడుతున్నారు.
ఇటీవల కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రి పదవి చేపట్టడంతో ఆయన మద్దతుదారులు ఫ్లెక్సీలు పెట్టారు. అయితే, గుర్తు తెలియని వ్యక్తులు వాటిని తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉన్న విభేదాల వల్ల మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరులే వాటిని తొలగించారన్న ఆరోపణలు వచ్చాయి. కాగా, ఫ్లెక్సీలను చించేసిన ఘటనలను వైసీపీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.