కరోనా కారణంగా చాలా కంపెనీల నిర్ణయాల్లో మార్పు వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి జై కొడుతున్నారు. ఇందులో భాగంగా ఇళ్ల వద్ద ఉండి పని చేస్తున్న క్రమంలో ఏమరుపాటు కారణంగా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ యువతి ఛార్జింగ్‌లో ఉంచిన ల్యాప్ టాప్ వాడుతుండగా అది పేలింది. దీంతో బాధితురాలు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని కడప జిల్లా బీ కోడూరు మండలం మేకవారి పల్లెకు చెందిన సుమలత బీ టెక్ పూర్తి చేసింది. బెంగళూరులోని యాజిక్ టెక్ సొల్యూషన్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. కరోనా కారణంగా ఆ కంపెనీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌలభ్యం కల్పించింది. దీంతో ఇంటి వద్దనే సుమలత ఆఫీస్ వర్క్ చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం ల్యాప్‌టాప్‌లో చార్జింగ్ అయిపోతున్న విషయాన్ని గమనించింది. 10 శాతం మాత్రమే ఛార్జింగ్ ఉండడంతో చార్జింగ్ కేబుల్‌ను స్విచ్ బోర్డు ప్లగ్‌కు కనెక్ట్ చేసింది. ఆ తర్వాత యథాలాపంగా వర్క్‌లో మునిగిపోయింది. ఓ వైపు ల్యాప్‌టాప్ హీట్ అవుతున్నా గమనించలేదు. దీంతో ఒక్కసారిగా అది పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె శరీరంలో 40% మేర కాలిన గాయాలు ఉన్నాయని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.