దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తూ.. పరిపాలన సంస్కరణలు, వికేంద్రీకరణ ద్వారా సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలకు పదేళ్లలో చేయాల్సినదాని కంటే మూడేళ్లలోనే సంక్షేమ పథకాల ద్వారా అధిక ప్రయోజనం చేకూర్చారని తెలిపారు. పదేళ్ల తర్వాత తమ కాళ్లపై తామునిలబడి.. పేదరికాన్ని అధిగమించేలా పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన పార్టీ జిల్లా అధ్యక్షులు, కో ఆర్డినేటర్ల నియామక వివరాలు వెల్లడిస్తూ మాట్లాడారు.