కర్ణాటకలోని హుబ్లీలోని ఓల్డ్ హుబ్లీ పోలీస్ స్టేషన్ లో ఏప్రిల్ 16న రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒక ఇన్‌స్పెక్టర్‌తో సహా నలుగురు పోలీసులు గాయపడ్డారు. శనివారం రాత్రి పాత హుబ్లీ పోలీస్ స్టేషన్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో నలుగురు పోలీసులు గాయపపడ్డారు. ఈ నేపథ్యంలో హుబ్లీ నగరంలో సెక్షన్ 144 విధించబడింది. ఏప్రిల్ 23 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
అక్కడ శాంతిభద్రతలకు సంబంధించి 12 కేసులు నమోదు కాగా, 134 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అభిషేక్ అనే విద్యార్థికి పరీక్ష రాయడానికి కోర్టు అనుమతి మంజూరు చేసింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్ వెలుపల గుమిగూడిన గుంపు ఒక్కసారిగా హింసాత్మకంగా మారి పోలీసు స్టేషన్‌పైనా, పోలీసు వాహనాలపైనా రాళ్లు రువ్వడం ప్రారంభించారని పోలీసులు తెలిపారు. గుంపును చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. వాట్సాప్‌లో అభ్యంతరకర స్టేటస్ ఉంచిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని ఆ గుంపు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. సమీపంలోని హనుమాన్ ఆలయం, ఆసుపత్రి నుండి నిరసనకారులు రాళ్లు రువ్వినట్లు సమాచారం.