ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తప్పుడు కేసులతో ఇబ్బంది పెడితే రోడ్డెక్కాల్సి వస్తుంది: నాదెండ్ల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 22, 2022, 02:01 PM

పాలకపక్ష నాయకులు తొందరపడి తీసుకునే నిర్ణయాలకు పోలీస్ శాఖ వత్తాసు పలికి జనసేన నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కులపరమైన ముద్ర వేసి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. పదవుల్లోకి వచ్చే ముందుకు రాగద్వేషాలకు అతీతంగా, ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి. పదవులు వచ్చాక అవి ఎందుకు గుర్తుకు రావని ప్రశ్నించారు. శుక్రవారం ప్రభుత్వ వేధింపులతో కేసులు ఎదుర్కొంటున్న మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఈమని ఎంపీటీసీ సభ్యులు సాయి చైతన్య భర్త పసుపులేటి శ్రీనివాసరావును ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. దుగ్గిరాల మండల జనసేన అధ్యక్షుడిగా ఉన్న పసుపులేటి శ్రీనివాసరావుపై బనాయించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. న్యాయపరంగా పార్టీ సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.


అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాసరావు మీద నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రజాస్వామికంగా, సమాజంలో ఎవరూ ఊహించని విధంగా వేధింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. చివరికి మండలాధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యే వరకు అనేక రకాలుగా కక్షపూరితంగా వ్యవహరించారు. శ్రీనివాసరావు వ్యవహారంలో ఈ ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యులు, నాయకులు చేస్తున్న పనులు సమాజంలో ప్రతి ఒక్కరు సిగ్గుతో తలదించుకునే విధంగా ఉందని అన్నారు. కష్టపడి చిన్న వ్యాపారం చేసుకుంటున్న కుటుంబాన్ని ఓటు వేయాలన్న ఉద్దేశ్యంతో ఇబ్బంది పెట్టారని, నెల్లూరు కోర్టులో చోరీ కేసులాగా కట్టుకధలు అల్లి, కొత్త కేసులు సృష్టించారని అన్నారు.


పెట్రోల్ బంకులో ఎవరో పెట్రోల్ పోసుకువచ్చారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండుకు పంపడం ఎంత పొరపాటో ఆలోచించాలని అన్నారు. శ్రీనివాసరావు విషయంలో ఇది నూటికి నూరు పాళ్లు బనాయించిన తప్పుడు కేసు అన్న విషయం వాళ్లు రాసిన ఎఫ్ఐఆర్ చూస్తే అర్ధం అవుతుందని చెప్పారు. ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరించారో అర్ధం అవుతోందని, తన కాళ్ల మీద తను నిలబడిన వ్యక్తిని ముష్టి ఓటు కోసం, మండలాధ్యక్ష పదవి కోసం ఇంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కులమతాలకతీతంగా రాజకీయ ప్రస్థానం సాగించాలన్న మూల సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని జనసేన పార్టీని స్థాపించిన విషయం అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. అలాంటి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను కేవలం కులపరంగా విడగొట్టే ధోరణితో వ్యవహరించడం బాధాకరమన్నారు.


క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఈ తరహాలో అనేక విషయాలు తమ దృష్టికి వస్తున్నాయని, సంబంధం లేని కేసుల్లో కార్యకర్తలను ఇరికిస్తున్నారన్నారు. ఓసీ రైతులు, కాపులు అంటే అస్సలు సాయం అందడం లేదని, ఈ విధమైన పరిస్థితుల మధ్య సమాజంలో అందర్నీ ఒకే విధంగా ఎలా చూడగలరని ప్రశ్నించారు. ఇది చాలా పొరపాటు అని సమాజంలో ఇటువంటి పరిస్థితులు, పరిణామాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారుల పై ఎంతైనా ఉందన్నారు. అధికారులు 30 సంవత్సరాలు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని, రాజకీయ నాయకులు తొందరపడి తీసుకునే నిర్ణయాలకు వత్తాసు పలికి తమ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందిపెట్టడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే తాము రోడ్డెక్కాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com