దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో 12 రాష్ట్రాలు అల్లాడుతున్నాయి ఏపీ, యూపీ, బీహార్ తదితర రాష్ట్రాల్లో 8 గంటల పాటు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. విద్యుత్ కోతలపై స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. లక్ష అంతకు మించి జనాభా ఉండే పట్టణాలలో డిస్కంలు 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్‌ను సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ సూచించింది. ఈ నిబంధనను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని పేర్కొంది. ఇందుకుగానూ ప్రతి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదేశాలివ్వాలని స్పష్టం చేసింది.
విద్యుత్ కోతల కారణంగా దేశంలోని చాలా పట్టణాల్లో డీజిల్ జనరేటర్ల వినియోగం పెరిగింది. దీంతో కాలుష్యంగా గరిష్టస్థాయిలో పెరుగుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిని నివారించాలంటే ఖచ్చితంగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని అభిప్రాయపడింది. లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో కచ్చితంగా కరెంట్ తీసిన మూడు నిమిషాల్లో పునరుద్ధరించాలని ఆదేశించింది. అలా చేస్తేనే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసినట్లవుతుందని పేర్కొంది. కరెంట్ కోతలతో బాధపడేవారు కాలుష్య నివారణకు డీజిల్ బదులు ప్రత్యామ్నాయ జనరేటర్లను వినియోగించాలని సూచించింది. సాంప్రదాయేతర ఇంధనాన్ని బ్యాటరీ బ్యాకప్ సాయంతో వినియోగించుకోవాలని పేర్కొంది.