ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ 2022: గుజరాత్ వర్సెస్ కోల్ కత్తా.. బలాబలాలు ఇవే..!

sports |  Suryaa Desk  | Published : Sat, Apr 23, 2022, 12:00 PM

ఐపీఎల్లో హార్తిక్ టీమ్ అదరగొడుతోంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లింది. అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న గుజరాత్ టైటాన్స్ మరో విజయమే టార్గెట్ గా కోల్కతా నైట్ రైడర్స్ ను రఫ్పాడించేందుకు సిద్దమైంది. అటు వరుస పరాజయాలతో డీలా పడ్డ శ్రేయస్ అయ్యర్ జట్టు , పటిష్ట గుజరాత్ ను చిత్తు చేసి విన్నింగ్ ట్రాక్ ఎక్కాలని భావిస్తోంది.


కోల్ కతా బ్యాటింగ్ ను గమనిస్తే ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా అరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్ రానున్నారు. గత మ్యాచ్ లో సునిల్ నరైన్ ఓపెనింగ్ రావడం జట్టుకు మైనస్ పాయింట్ అయింది. ఈ నేపథ్యంలో వెంకటేష్ ను తిరిగి ఓపెనర్ గానే పంపిస్తే జట్టు జట్టుకు మేలు చేకూరుతుంది. దీనికి తోడు పించ్ ఫాంలోకి రావడం జట్టుకు ప్లస్ పాయింట్.


మిడిలార్డర్ లో కెప్టెన్ శ్రేయాస్, నితీష్ రాణా, రసెల్ ఆడతారు. అయ్యర్ సూపర్ ఫాంలో ఉన్నాడు. నితీష్ రాణా కొద్దిగా సతమతమవుతున్నాడు. అటు రసెల్ చెలరేగితే మాత్రం కోల్ కతా భారీ స్కోరు చేయడం సులభం. లోయర్ ఆర్డర్ లో షెల్డన్ జాక్సన్, సునిల్ నరైన్, పాట్ కమ్మిన్స్ జట్టును ఆదుకునేందుకు సిద్దంగా ఉన్నారు.


అటు బౌలింగ్ లో ఉమేష్ అదరగొడుతున్నాడు. వరుణ్ చక్రవర్తి మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటూ జట్టుకు భారంగా మారాడు. పాట్ కమ్మిన్స్, రస్సెల్ కూడా ఎకానమీని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. శివమ్ మావీ మోస్తారుగా బౌలింగ్ చేస్తున్నాడు.


ఇక గుజరాత్ జట్టును పరిశీలిస్తే ఓపెనర్లుగా వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్ రానున్నారు. గత మ్యాచ్ లో 11 పరుగులే చేసిన సాహా, ఈ గేమ్ లో చెలరేగుతాడని అంతా భావిస్తున్నాడు. అటు శుభమాన్ గిల్ గత మూడు మ్యాచుల్లో విఫలమవడం జట్టును కలవరపెడుతోంది. మిడిలార్డర్ లో విజయశంకర్ వైఫల్యం కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో అతన్ని తుది జట్టు నుంచి తప్పించే అవకాశాలున్నాయి. అతని స్థానంలో సాయి సుదర్శన్ ను జట్టులోకి తీసుకోవచ్చు. గత మ్యాచ్కు దూరమైన హార్థిక్, ఈ మ్యాచ్ తో జట్టులో చేరనుండటం టీమ్ బలాన్ని పెంచుతుంది.


అటు అభినవ్ మనోహర్ కూడా విలువైన పరుగులు చేస్తున్నాడు. దాదాపు 30 ప్లస్ రన్స్ సాధిస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. లోయర్ ఆర్డర్లో డేవిడ్ మిల్లర్ గుజరాత్ బ్యాటింగ్ కు అతి పెద్ద బలంగా మారాడు. ఇతను ఎక్ట్రార్డినరీ బ్యాట్సమన్. మిల్లర్ మరోసారి చెలరేగితే గుజరాత్ గెలుపు ఈజీ. ఇతనికి తోడు రాహుల్ తేవాటియా, రషీద్ ఖాన్ లు పర్వాలేదనిపిస్తున్నారు. డెత్ ఓవర్లలో వీరిద్దరి స్ట్రైక్ రేట్ 180 కంటే ఎక్కువగా ఉంటుంది.


బౌలింగ్ లో మాత్రం కోల్ కతా కంటే గుజరాత్ పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అల్జరీ జోసెఫ్ గత మ్యాచులో రెండు వికెట్లతో చెలరేగాడు. అటు షమీ ఒక వికెట్ మాత్రమే తీసుకున్నా, ఎకానమీని కంట్రోల్ చేసుకున్నాడు. రషీద్ ఖాన్ కూడా తన స్పిన్ మాయాజాలంతో బ్యాట్సమన్ ను కట్టడి చేస్తున్నాడు.


అయితే ఫెర్గ్యూసన్, యష్ దయాల్ మాత్రం లాస్ట్ మ్యాచ్లో తేలిపోయారు. గత మ్యాచుల గణాంకాలు, ప్రస్తుతం ఫాంను బట్టి చూస్తే ఈ మ్యాచ్ లో మాత్రం గుజరాత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. అయితే బ్యాటింగ్ బలంగా ఉన్న గుజరాత్ మీద నెగ్గాలంటే, కోల్ కతా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 190 కంటే ఎక్కువ చేయాల్సి ఉంటుంది.


ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో స్టార్ట్ కానుంది. పిచ్ విషయానికి వస్తే, డివై పాటిల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. అలాగే స్పిన్ కు సహకరిస్తుంది. పాటిల్ గ్రౌండ్ చిన్న గ్రౌండ్ కాబట్టి పింఛ్ హిట్టర్లు చెలరేగి ఆడొచ్చు. ఇక్కడ 10 మ్యాచులు ఆడితే ఆరు సార్లు రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టు, నాలుగు సార్లు మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ గెలిచింది. అయితే ఇక్కడ రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టు విజయావకాశాలు 60 శాతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన టీమ్ బౌలింగ్ ఎంచుకునే ఛాన్సు ఎక్కువగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com