వరుస విజయాలతో దూసుకుపోతున్న రెండు జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. వీకెండ్ లో సూపర్ ఫాంలో ఉన్న హైదరాబాద్, బెంగుళూరు ఫ్యాన్స్ కు క్రికెట్ కిక్ ఇచ్చే విధంగా తలపడబోతున్నాయి. ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న బెంగుళూరు, హైదరాబాద్ పై గెలిచి అగ్రస్థానంలో నిలవాలని చూస్తోంది. అటు ఆరు మ్యాచుల్లో నాలుగు విజయాలు, రెండు ఓటములతో 8 పాయింట్లు సాధించి 5వ స్థానంలో ఉన్న హైదరాబాద్, పటిష్ట బెంగుళూరు మట్టికరిపించి ముందుకు పోవాలని ప్రణాళికలు రచిస్తోంది.
జట్ల బలాబలాలను గమనిస్తే బెంగుళూరులో ఓపెనర్లుగా డూ ప్లెసిస్, అనుజ్ రావత్ రాన్నారు. హైదరాబాద్ ఇన్నింగ్స్ ను విలియమ్సన్, అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తారు. గత మూడు మ్యాచుల్లో బెంగుళూరు ఓపెనర్లు 138 పరుగులు చేస్తే, హైదరాబాద్ ఓపెనర్లు 153 రన్స్ కొట్టారు. అయితే ఈ విభాగంలో హైదరాబాద్ బెంగుళూరు కంటే బెటర్ గా కనిపిస్తోంది. కానీ గత మ్యాచ్లో డూ ప్లెసిస్ సెంచరీ మిస్సయినా సూపర్ ఫాంలో ఉండటం రాయల్స్ ఛాలెంజర్స్ కు కలిసొచ్చే అంశం. కానీ హైదరాబాద్ కెప్టెన్ కేన్ గుజరాత్ తో మ్యాచ్ లో మాత్రమే హిట్టయ్యాడు. కానీ ఆ తర్వాత రెండు మ్యాచుల్లో విఫలమయ్యాడు.
మిడిలార్డర్ లో బెంగుళూరు తరపున విరాట్, మాక్స్వెల్, దినేష్ కార్తీక్ రానుండగా, హైదరాబాద్ తరపున రాహుల్ త్రిపాటి, పూరన్, మార్కరమ్ ఆడతారు. బెంగుళూరు మిడిలార్డర్, లాస్ట్ త్రీ మ్యాచుల్లో 202 పరుగులు చేస్తే, హైదరాబాద్ మిడిలార్డర్ ఏకంగా 317 పరుగులు దంచికొట్టింది. మిడిలార్డర్ లో బెంగుళూరును బీట్ చేయగల సత్తా హైదరాబాద్ కు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాహుల్ త్రిపాటి జట్టుకు విలువైన పరుగులు చేస్తుండగా, పూరన్, మార్కరమ్ మంచి ఫినిషింగ్ ఇస్తున్నారు. అటు బెంగుళూరులో కోహ్లీ స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. అయితే మాక్స్వెల్, దినేష్ కార్తీక్ మరోసారి రాణిస్తే బెంగుళూరు భారీ స్కోరు సాధించడం లేక భారీ స్కోరును ఛేదించడం ఈజీ.
లోయర్ ఆర్డర్లో బెంగుళూరు షాబాద్ అహ్మద్, హసరంగా, ప్రభుదేశాయ్ బ్యాటింగ్ చేస్తారు. హైదరాబాద్ లో శశాంక్ సింగ్, జగదీష్ సుచిత్, భువనేశ్వర్ కుమార్ ఆడతారు. అయితే బెంగుళూరు మిడిలార్డర్ గత మూడు మ్యాచుల్లో 153 రన్స్ చేస్తే, హైదరాబాద్ లోయర్ ఆర్డర్ కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. అయితే బ్యాట్సమన్ పరంగా చూస్తే మాత్రం బెంగుళూరు లోయర్ ఆర్డర్ బెటర్ గా కనిపిస్తోంది.
బౌలింగ్ లో బెంగుళూరులో హేజిల్ వుడ్,హసరంగా, సిరాజ్ బౌలింగ్ చేస్తారు. హైదరాబాద్ బౌలింగ్ లైనప్ లో మార్కో జాన్సన్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ ఉంటారు. లాస్ట్ త్రీ మ్యాచుల్లో బెంగుళూరు 19 వికెట్లు దక్కించుకుంటే హైదరాబాద్ 22 వికెట్లను పడగొట్టింది. ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్ నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్సమన్ ను బెంబేలెత్తిస్తున్నాడు. అటు భువీ ఫాంలోకి రావడం జట్టుకు ప్లస్ పాయింట్. బెంగుళూరులో హేజిల్ వుడ్ మాత్రమే ఫాంలో ఉన్నాడు. మిగతా వారు స్థాయికి తగట్టు రాణించడం లేదు.
రెండు జట్లు 20 మ్యాచుల్లో తలపడితే సన్ రైజర్స్ 11 మ్యాచుల్లో, రాయల్ ఛాలెంజర్స్ 8 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్ రద్దయింది.
ఈ మ్యాచ్ ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు గేమ్ స్టార్ట్ కానుంది. ఈ పిచ్ సాధారణంగా బౌలర్లు, బ్యాట్స్మెన్ ఇద్దరికీ సహకరిస్తుంది. షార్ట్ బౌండరీలు, వేగవంతమైన ఔట్ ఫీల్డ్ వల్ల బ్యాట్స్ మెన్ ఈజీగా పరుగులు సాధిస్తారు.
ఈ పిచ్ పై 15 మ్యాచులు జరిగితే ఎనిమిదింటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు, మరో ఏడింటిలో రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. ఈ సీజన్ లో ఎనిమిది మ్యాచులు జరగ్గా, నాలుగు మ్యాచుల్లో ఛేజింగ్ చేసిన టీమే గెలిచింది. అత్యధిక స్కోరు 217 కాగా, అత్యల్ప స్కోరు 115. అవరేజ్ స్కోరు 186 పరుగులు. మంచు ప్రభావం కూడా తక్కువే. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ.
గత మ్యాచుల్లో విజయాలు, ఇరు జట్ల గణాంకాలు, ప్రస్తుతం ఆటగాళ్ల ఫాంను బట్టి చూస్తే ఈ గేమ్ లో మాత్రం హైదరాబాద్ ఫేవరెట్ అని చెప్పొచ్చు.