తెలంగాణలోని వనప్తరి జిల్లా గాంధీ నగర్‌కు చెందిన బాల స్వామికి లావణ్య అనే మహిళతో 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బాలస్వామి కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇటువంటి తరుణంలో లావణ్యకు నవీన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం భర్తకు తెలియడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. భర్త హెచ్చరించినా వినకుండా ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని ఆమె కొనసాగించింది.
ఈ క్రమంలో 5 నెలల క్రితం తనకున్న భూమిని బాలస్వామి విక్రయించగా రూ.30 లక్షలు వచ్చాయి. ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో కలిసి పరార్ అవ్వాలని లావణ్య భావించింది. పనిలో పనిగా భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేసింది. అర్ధరాత్రి మైసమ్మ గుడి వద్దకు వెళ్లి కోడిని కోసి రావాలని భర్తకు లావణ్య సూచించింది. ఆమె మాటలు నమ్మి వెళ్లిన బాలస్వామిని అప్పటికే కాపు కాసిన నరహంతక ముఠా కారులో ఎక్కించుకుని అపహరించింది. గొంతు నులిమి చంపేసిన తర్వాత బాలస్వామి మృతదేహాన్ని లావణ్య హైదరాబాద్ బాలాపూర్ శివారులోని స్మశాన వాటిక సమీపంలో పూడ్చిపెట్టించింది. బాలస్వామి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు వాస్తవాలు తెలిశాయి. శుక్రవారం నిందితులందరినీ అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.