నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ పదవి నుంచి రాజీవ్ కుమార్ వైదొలిగిన సంగతి తెలిసిన విషయమే. ఐదేళ్ల క్రితం నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌గా నియమితులైన రాజీవ్ కుమార్ శుక్రవారం రాజీనామా చేశారు. దీంతో రాజీవ్ కుమార్ స్థానంలో సుమన్ బెరీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాజీవ్ కుమార్ రాజీనామాను మంత్రివర్గం నియామకాల కమిటీ ఆమోదించిందని.. ఈ మేరకు ఆయన వారసుడిగా సుమన్ బెరీని నియమించినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించింది. మే 1 నుంచి సుమన్ బెరీ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని తెలిపింది.సుమన్ బెరీ 2001 నుండి 2011 వరకు పదేళ్ల పాటు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఆయన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి, స్టాటిస్టికల్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానానికి సంబంధించిన సాంకేతిక సలహా కమిటీలో కూడా సభ్యుడిగా చేసిన అనుభవం ఉంది. 2013లో లాభాపేక్షలేని పరిశోధన థింక్ ట్యాంక్ అయిన పహ్లే ఇండియా ఫౌండేషన్‌ను సుమన్ బెరీ స్థాపించారు. దీనికి 2017 వరకు ఆయన నాయకత్వం వహించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో కూడా రెండు పర్యాయాలు పనిచేశారు. కాగా ప్రస్తుత నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఈనెల 30న పూర్తిగా బాధ్యతల నుంచి వైదొలుగుతారని కేంద్రం వెల్లడించింది.