తన బర్త్ డే వేడుకలు ఉన్నాయని చెప్పి ఓ యువకుడు ఓ బాలికను తన ఇంటికి రప్పించాడు. ఆ బాలికకు నిప్పంటించి, అనంతరం ఆ యువకుడు నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారిద్దరూ మృతిచెందారు. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగింది.
పాలక్కాడ్ జిల్లాలోని కొల్లెంగోడ్ గ్రామానికి చెందిన బాలసుబ్రమణియం(23) తన పుట్టిన రోజు ఉందంటూ ఓ బాలికను ఇంటికి పిలిచాడు. ఇంటికి వెళ్లిన ఆమెను గదిలోకి తీసుకెళ్లి నిప్పంటించాడు. ఆ తర్వాత తానూ నిప్పంటించుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో యువకుడి తల్లి, తమ్ముడు ఉన్నారు. తీవ్ర గాయాలైన ఇరువురిని స్థానికుల సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. వారిరువురు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారని స్థానికులు తెలిపారు. వారి ప్రేమను రెండు కుటుంబాలు ఒప్పుకోలేదు. ఆ కారణంగానే బాలసుబ్రమణియం బాలికకు నిప్పుపెట్టి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని వెల్లడించారు. కానీ, బాలికతో ప్రేమ, సంబంధం గురించి తమకు ఎలాంటి విషయాలు తెలియదని బాధితుడి తల్లి పేర్కొంది. ఇంటికి ఎలా వచ్చిందో కూడా తమకు తెలియదని చెప్పింది.