ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. గిన్నెలు కడగలేదని రూమ్ మేట్ ను హత్య చేసిన ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు.. దెంకనల్ జిల్లాకు చెందిన అమర్ బసంత్ మహోపాత్ర (28), కటక్ జిల్లాకు చెందిన శరత్ కుమార్ దాస్ (21), జార్ఖండ్‌కు చెందిన బిర్జు సాహు (40) ముగ్గురూ పూణెలో అద్దెకుంటున్నారు. ఈ ముగ్గురూ ఓ సెలూన్ లో పనిచేస్తూ ఒకే గదిలో ఉంటున్నారు. రూమ్ లో అంట్లు తోమాలని శరత్ కుమార్ దాస్ కు అమర్ చెప్పడంతో అది అతనికి నచ్చలేదు. తనను ఆదేశించినట్లుగా శరత్ కుమార్ దాస్ భావించాడు.
దీంతో అమర్ పై కోపం పెంచుకుని రాత్రి 11:40 గంటలకు రూమ్ లో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అమర్ పై వంటగదిలోని కత్తితో దాస్ దాడి చేయడంతో ఛాతీ కింద లోతైన గాయాలయ్యాయి. దీంతో బాధితుడు స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో వెంటనే అతడిని రూమ్ లోని మూడో వ్యక్తి హాస్పిటల్ కి తీసుకెళ్లేలోపే ప్రాణాలొదిలాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.