ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టిడిపి పుంజుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికలలో వైసిపి అభ్యర్థి ఇక్కడ తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. సమీప టీడీపీ అభ్యర్థి పై ఏకంగా 82 వేల మెజార్టీ కి పైగా సాధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గిద్దలూరు కంచుకోట అని నిరూపించారు.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఆ కోటకు బీటలు వారుతున్నాయి అని స్థానిక ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరు టీడీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వివిధ కార్యక్రమాల్లో దూసుకుపోతూ టిడిపిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుండి పలువురు టిడిపి గూటికి చేరే విధంగా పావులు కదిపి ఆయన తన మార్కు చూపిస్తున్నారు.
ప్రజలు పిలిచిన ప్రతి కార్యక్రమానికి హాజరై ప్రతి ఒక్కరి తో మమేకమై వెళ్తున్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తామని అశోక్ రెడ్డి పలు గౌరవ సభల్లో వెల్లడించారు. ఈనెల 29వ తేదీ నియోజకవర్గంలో భారీగా మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రజలకు సంకేతాలు పంపారు. వైసిపి పార్టీని వీడి టీడీపీలో చేరేందుకు భారీగా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నట్లు నియోజకవర్గంలో విస్తృతంగా పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే వైసీపీ పార్టీలో గ్రూపు తగాదాలు నాయకత్వ ఆధిపత్య పోరుతో పార్టీకి నష్టం జరుగుతుందని వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతే కాకుండా ఇటీవల అధిక ధరలు పెరిగి పోవడంతో పాటు విద్యుత్ కోతలు,విద్యుత్ చార్జీలు ప్రజలలో ప్రభుత్వంపై అసహనాన్ని పుట్టించాయి అని మరి ఈ అసహనం ఎటువైపు దారి తీస్తుందో అని వైసీపీ కార్యకర్తలు లోలోన మదన పడిపోతున్నారు.
మరి నియోజకవర్గంలో ప్రస్తుతం టిడిపి దూకుడు చూస్తే తదుపరి ఎన్నికలకు నువ్వానేనా అన్నట్లు గా పోటీ లో ఉండే ఆస్కారం తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి మే ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏవిధమైన అవగాహన కల్పిస్తారో కార్యక్రమం ప్రారంభం అయినా కొద్ది రోజుల తర్వాత కానీ ఒక అభిప్రాయానికి రాలేమని ప్రజలు చెబుతున్నారు. మరి ఎన్నికలు చాలా దూరం ఉన్నా ప్రస్తుతం నియోజకవర్గంలోని పరిస్థితులు ఎన్నికలను తలపించే విధంగా ఉన్నాయి.