ఉద్యోగం చేస్తేనే జీతం,...ఇంకా బాగా చేస్తే మెరుగైన వేతనం. ఇది మనం వినే ఉంటాం. కానీ ఉద్యోగంలో నుంచి తొలగించినా మంచి పారితోషికం ఎక్కడైనా విన్నామా...? టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ త్వరలోనే ట్విట్టర్‌ను సొంతం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్‌లో ఇప్పటికే వాటాలు ఉన్న ఆయన.. మైక్రో బ్లాగింగ్ సైట్‌ను పూర్తిగా సొంతం చేసుకోవడం కోసం 44 బిలియన్ డాలర్ల డీల్‌ను ప్రతిపాదించగా.. అందుకు ట్విట్టర్ ఓకే చెప్పింది. ట్విట్టర్ మస్క్ గూటికి వెళ్లాక.. సంస్థలో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులను ఆయన మార్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్విట్టర్ సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్‌ను సైతం బాధ్యతల నుంచి తప్పించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ట్విట్టర్ సీఈవో బాధ్యతల నుంచి పరాగ్‌ను తప్పిస్తే.. ఆయనకు 42 మిలియన్ డాలర్లను పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుంది. ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే పరాగ్‌ను తప్పించాల్సి వస్తే ఆయనకు దాదాపు 42 మిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వాల్సి వస్తుందని రీసెర్చ్ సంస్థ ఈక్విలార్ తెలిపింది.
2021 నవంబర్లో జాక్ డోర్సీ నుంచి అగర్వాల్ ట్విట్టర్ సీఈవో బాధ్యతలను స్వీకరించారు. మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడం ఖాయమయ్యాక.. ఉద్యోగులతో టౌన్ హాల్ మీటింగ్‌లో మాట్లాడిన అగర్వాల్.. సంస్థ భవిష్యత్తు సందిగ్ధంలో పడిందన్నారని తెలుస్తోంది. ఇప్పటికే లేఆఫ్‌లు లేవని పరాగ్ చెప్పినప్పటికీ.. ఈ సందిగ్ధ పరిస్థితుల్లో మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లేవని ఆయన అంగీకరించారు. భవిష్యత్తులో ట్విట్టర్ ఏ దిశలో పయనిస్తుందనేది తనకు తెలీదన్నారు.
‘టేక్ ఓవర్ డీల్ పూర్తయ్యాక.. ట్విట్టర్ ప్రయివేట్ సంస్థగా మారుతుంది. కంపెనీ బోర్డును తొలగిస్తార’ని ట్విట్టర్‌లో ఇండిపెండెంట్ బోర్డ్ చెయిర్‌గా ఉన్న బ్రెట్ టేలర్ తెలిపారు. ప్రస్తుత మేనేజ్‌మెంట్ పట్ల తనకు నమ్మకం లేదని మస్క్ ఇప్పటికే చెప్పారు. సీఈవో పరాగ్ అగర్వాల్ సామర్థ్యాల పట్ల బోర్డు అంత నమ్మకంగా లేదని మస్క్ ఇప్పటికే సంకేతాలిచ్చారు.
‘ట్విట్టర్‌కు ఓ లక్ష్యం ఉంది.. అది ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేయగలదు. మా టీంను చూస్తే గర్వంగా ఉంది’ అని అగర్వాల్ సోమవారం రాత్రి ఓ ప్రకటన చేశారు. ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టక ముందు పరాగ్ అగర్వాల్ ఆ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో)గా వ్యవహరించారు. అందుకు గానూ 2021లో ఆయన 30.4 మిలియన్ డాలర్లను అందుకున్నారు. ఐఐటీ బాంబేలో బీటెక్ చదివిన అగర్వాల్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆయన పీహెచ్‌డీ చేశారు. మైక్రోసాఫ్ట్, యాహూల్లో పని చేసిన పరాగ్.. 2011లో ట్విట్టర్‌లో చేరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa