పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ అంధ బాలికను అధికారులు పరీక్షకు అనుమతించలేదు. ఈ ఘటన ఏపీలోని నంద్యాల జిల్లా పట్టణ కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. నూనెపల్లె సాయిబాబా నగర్ కు చెందిన మల్లారి ద్రాక్షయని అనే అంధ బాలిక పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రాయడానికి గుడ్ షెఫర్డ్ స్కూల్ పరీక్ష కేంద్రానికి వెళ్లింది. అయితే విద్యాశాఖ మరియు పరీక్షల విభాగానికి చెందిన అధికారులు ఆమెను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో ద్రాక్షయని ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఎంత ప్రాధేయపడినా, ఎంత మొరపెట్టుకున్నా కనికరించలేదని ఆ అంధ బాలిక యొక్క బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
పదో తరగతి పరీక్షలు రాసే అంధ విద్యార్థినీ విద్యార్థులు 9వ తరగతి విద్యార్థులతో తాము ఆన్సర్ లు చెపుతూ పరీక్షలు రాయించుకునే వెసలుబాటు ఉంది. అయితే ఎక్కడ లోపం ఏర్పడిందో గాని రెండు కళ్లు లేని ఈ బాలికను పరీక్షకు అనుమతించలేదు. ఈ ఘటన పరీక్షా కేంద్రం వద్ద ఉన్నటువంటి పలువురు హృదయాలను కలచి వేసింది. దీని పై విచారించి బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, టీఎన్ఎస్ఎఫ్, ఎన్ఎస్ యూఐ, ఏబీవీపీ విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకుంటే ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. తదుపరి పరీక్షలకు విద్యార్దినిని అనుమతించాలన్నారు.