మంత్రులు, వైసీపీ ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు, వైసీపీ జిల్లా అధ్యక్షులతో ఏపీ సీఎం జగన్ బుధవారం సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు అంశాలపై సీఎం జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. గడప గడపకు వైసీపీ సర్వే చేస్తామని సీఎం జగన్ తెలిపారు. సర్వేలో రిజల్ట్ బాగా వచ్చిన వాళ్లకే సీట్లు ఇస్తామని చెప్పారు. గెలవరని సర్వేలో తేలితే సీట్లు ఇవ్వమని స్పష్టం చేశారు. గెలవండి.. గెలిపించండి అని సీఎం జగన్ తమ పార్టీ నేతలకు తెలిపారు.
సీఎం జగన్ మాట్లాడుతూ 'గెలిచేందుకు కావాల్సిన వనరులు సమకూరుస్తా. మే 10 నుంచి నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు పర్యటనలు చేయాలన్నారు. పార్టీ పరంగా ఉన్న వివిధ విభాగాలకు యాక్టివేట్ చేయాలి. విబేధాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. జిల్లా అధ్యక్షుల్ని జిల్లా అభివృద్ధి మండలి ఛైర్మన్లుగా చేస్తున్నాం. వారికి కేబినెట్ హోదా ఇస్తున్నాం. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదలవుతాయి. మే నుంచి పూర్తిగా గేర్ మారుస్తున్నాం. అందరూ సన్నద్ధం కావాలి. 175 సీట్లకు 175 ఎందుకు రాకూడదు. గతంలో కుప్పంలో మనం గెలవలేదు. కానీ అక్కడ స్థానిక ఎన్నికల్లో గెలిచాం. పార్టీ అన్నది సుప్రీం. పార్టీ పరంగా నిరంతరం దృష్టి, ధ్యాస ఉండాలి. పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం. ప్రతి ఎమ్మెల్యేకు నెలకు 10 సచివాలయాలు, ప్రతి సచివాలయంలో 2 రోజులు తిరగాలి. అలా చేస్తే ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరుగుతుంది' అని అన్నారు.