దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. కఠిన శిక్షలు విధిస్తున్నా కామాంధులు ఆగడాలు కొనసాగుతున్నాయి. చిన్న పిల్లలపై కూడా కొందరు కామంతో కళ్లు మూసుకుపోయి, లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా స్కూలుకు వెళ్తున్న ఓ చిన్నారిపై దుండగుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
యూపీలోని లక్నో నగరం అలంబాగ్ మెట్రోస్టేషన్ నుంచి ఓ బాలిక నిత్యం తాను చదివే పాఠశాలకు రాకపోకలు సాగిస్తుంటుంది. మంగళవారం ప్రైవేట్ పాఠశాలకు వెళ్లి, తిరిగి వస్తున్న క్రమంలో ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. 12 ఏళ్ల ఆ బాలిక మెట్రో స్టేషన్ లిఫ్ట్‌లోకి రాగానే ఓ 40 ఏళ్ల వ్యక్తి కూడా అందులోకి ఎక్కాడు. లిఫ్ట్ డోర్ మూసుకోగానే బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ బాలిక భయాందోళనకు గురైంది. పరుగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి తన అన్నకు జరిగిన విషయం చెప్పింది. నిందితుడిని పట్టుకుందామని బాలిక సోదరుడు వెళ్లగానే అతడు పారిపోయాడు. ఈ ఘటనపై బాలిక తండ్రి అలంబాగ్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.