ఇప్పటివరకు వారి ఆటలు ఇష్టానుసారంగా సాగాయి. ఇక ఆటలు సాగవని ఇటీవల అధికారులు తేల్చేశారు. మద్య నిషేధాన్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వానికి నాటు సారా తయారీ దారులు తలనొప్పిగా మారారు. ఒకటి కాదు రెండు కాదు వేల లీటర్ల లో బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్న, నాటు సారా తయారీ ధరలు ఏ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ నాటుసారా సంస్కృతి కొనసాగిన ముఖ్యంగా పచ్చిమ ప్రకాశం ప్రాంతంలో మాత్రం నాటుసారా మరింత ఎక్కువగా ప్రబలింది. దీంతో క్రైమ్ రేటు కూడా పెరిగిపోవడంతో నాటు సారా తయారు చేసే అమ్ముతున్న వారిని నిరోధించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శలు కూడా వినిపించాయి. దీంతో ఉన్నత పోలీసు అధికారులు కొత్త టీంలను రంగంలోకి దించాయి. ఎక్కడపడితే అక్కడ బెల్లం ఊటను ధ్వంసం చేస్తూ నాటుసారా తయారీదారులకు సవాల్ విసిరారు. ఏకంగా వందల మంది పై కేసులు నమోదు అయ్యాయి అంటే మీరే అర్థం చేసుకోవచ్చు నాటు సారా సంస్కృతి ఎంత ప్రబలిపోయిందో.
కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా మద్యం షాపులను కూడా మూసివేసింది. ఆ సందర్భంలో నాటుసారా తయారీ దారులు మరింత చేతివాటం ప్రదర్శించారు. ఏకంగా లీటర్ నాటుసారా కు నాలుగు వందల రూపాయల నుంచి 700 రూపాయల వరకు దండుకున్నారు. ఓ పక్క కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు పోలీసులు తలమునకలై ఉండగా నాటుసారా తయారీ దారులు మాత్రం రెచ్చిపోయారు.
అప్పటినుంచి నేటికీ నాటుసారా సంస్కృతి నిరోధించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు కొత్త పంథా ఆచరిస్తున్న నాటు సారా తయారీ దారులు మాత్రం అధికారులకు సవాల్ విసురుతూనే ఉన్నారు. రాజకీయ నాయకుల అండదండలు పెట్టుకొని నాటుసారా సంస్కృతిని కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో ఉన్నత అధికారులు వారిపై కన్నెర్ర చేశారు.
ఇటీవల కొంతమంది పై పిడియాక్ట్ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా తరలించారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే నాటుసారా తయారీ దారుల పై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ నాటు సారా తయారీ దారులను హెచ్చరించారు. ఇక ఉపేక్షించబోమని కచ్చితంగా పిడియాక్ట్ కేసులు పెడతామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరి ఇలాంటి కఠినమైన నిర్ణయాలతో అయినా నాటుసారా సంస్కృతికి తెర పడుతుందో లేదో వేచి చూద్దాం.