టీమిండియా మాజీ సారథి కోహ్లి వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారీ స్కోర్లు చేయలేకపోతున్నా కోహ్లి ఐపీఎల్‌లోనూ తడబడుతున్నాడు. దీంతో కోహ్లికి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని సలహా ఇచ్చాడు. కోహ్లి ఇప్పటి వరకు ఐపీఎల్-2022లో 9 మ్యాచ్‌లు ఆడి కేవలం 128 పరుగులు మాత్రమే చేయగలిగాడు. లక్నో, హైదరాబాద్ జట్లతో జరిగిన మ్యాచ్‌లలో గోల్డెన్ డక్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఈ క్రికెట్ దిగ్గజంపై అన్ని వైపుల నుంచి విమర్శలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రవిశాస్త్రి అతడిని ఐపీఎల్ నుంచి విశ్రాంతి తీసుకోవాలని, మైండ్ రీఫ్రెష్ చేసుకుని క్రికెట్‌లో అడుగు పెట్టాలని సలహా ఇచ్చాడు.
తాను ఎవరికైనా ఇదే సలహా ఇస్తానని రవిశాస్త్రి పేర్కొన్నాడు. టీమిండియాకు కొన్నేళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి అలసిపోయాడని చెప్పాడు. దీంతో పరుగుల యంత్రంగా పేరొందిన కోహ్లి ప్రస్తుతం పరుగులు చేయలేక సతమతం అవుతున్నాడన్నారు. మరి కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలంటే ప్రస్తుతం కోహ్లి ఐపీఎల్ నుంచి తప్పుకోవడమే ఉత్తమమని సూచించారు. 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో కోహ్లి చివరిసారిగా సెంచరీ చేశాడు. అప్పటి నుంచి మరో సెంచరీ సాధించలేకపోయాడు.