ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం పదేళ్ల పాటు కొనసాగొచ్చంటూ యూకే విదేశాంగ సెక్రటరీ లిజ్ ట్రస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడిలో పుతిన్ గెలిస్తే ఐరోపాలో భయంకరమైన దుస్థితి, ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర పరిణామాలుంటాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగొచ్చని, అందుకు ఐరోపా సిద్ధంగా ఉండాలని లిజ్ ట్రస్ హెచ్చరించారు. బ్రిటన్, దాని మిత్ర దేశాలు రష్యాను ఉక్రెయిన్ నుంచి వెళ్లగొట్టేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రష్యా సేనలు ఉక్రెయిన్ లోనే ఉంటే జార్జియా, మాల్దొవా దేశాలపై కూడా అవి దాడులకు పాల్పడే అవకాశం ఉందని యూకే ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా తన దాడులను ప్రారంభించింది. ఊహించని రీతిలో ఉక్రెయిన్ నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో రష్యా బలగాలు విధ్వంసానికి పాల్పడుతున్నాయి. ఇరు దేశాల వైపు ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. అమాయకుల్ని హతమార్చడం, లైంగిక దాడులకు పాల్పడటం వంటివి ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి.