ఏపీలో మరోసారి పదో తరగతి పరీక్షల పేపర్ లీక్ కావడం కలకలం రేపుతోంది. క్వశ్చన్ పేపర్లు వరుసగా బయటకు రావడం సంచలనంగా మారింది. శుక్రవారం ఇంగ్లీష్ పేపర్ లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. వాట్సాప్ గ్రూపుల్లో టెన్త్ పరీక్షల పేపర్లు దర్శనమిచ్చాయి. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పేపర్ లీకులు కలకలం రేపుతున్నాయి. నందికొట్కూరు గాంధీ మెమొరియల్ స్కూల్ నుంచి పేపర్ బయటకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
పాఠశాల అటెండరే లీక్ చేశాడని అనుమానిస్తున్నారు. పేపర్ లీక్ పై కర్నూలు జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. పేపర్ లీక్ కాలేదని అధికారులు అంటున్నారు. అనంతపురం జిల్లాలోని ఆమడగూరులో పేపర్ లీక్ ప్రచారం అవాస్తవమని విద్యాశాఖ తెలిపింది. ఎక్కడా పేపర్ లీక్ జరగలేదని అధికారులు చెబుతున్నారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.