వేసవిలో ఉక్కపోత, చెమటలతో ఎక్కడ లేని చిరాకు కలుగుతుంది. అందుకే వేసవిలో చర్మ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుని, పాటించాలి.
- మేకప్ వేసుకునే క్రమంలో లేదా చర్మ సంరక్షణలో భాగంగా వేసవిలో వాటర్ బేస్డ్ సీరమ్స్ ఉపయోగించాలి. ఇది చర్మం లోపలి పొరల్లోకి వెళ్లడమే కాకుండా తగినంత పోషణ అందించడం ద్వారా ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. అలాగే చర్మంపై ఉండే ముడతలు, సన్నని గీతలను నివారిస్తూ తేమను కూడా అందిస్తుంది.
- చెమట కారణంగా చర్మంపై మరింత ఎక్కువగా మలినాలు, దుమ్ము వంటివి పేరుకుపోతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు స్క్రబింగ్ ప్రక్రియ ద్వారా చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.
- వేసవిలో మేకప్ వీలైనంత తక్కువగానే వేసుకోవడం ఉత్తమం నిపుణులు అంటున్నారు. నూనె ఆధారిత ఉత్పత్తులకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
- పెదవులకు లిప్‌బామ్ తప్పనిసరిగా రాసుకోవాలి. ఇవి కాకుండా హెవీగా కనిపించే ఐ మేకప్, కన్సీలర్స్, బ్లష్ మొదలైనవన్నీ వేసవిలో కాస్త దూరం పెడితేనే మంచిది.
- వేసవిలో బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. సూర్యరశ్మిలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తే తప్పనిసరిగా ప్రతి 2 గంటలకోసారి సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండాలి.
- వేసవిలో ముఖం, పాదాల సంరక్షణ విషయంలో అశ్రద్ధ చేయకూడదు. అందుకే నిర్ణీత వ్యవధికోసారి ఫేషియల్, పెడిక్యూర్ వంటివి చేయించుకోవాలి.
- ఎండాకాలంలో ఉండే అధిక చెమటల కారణంగా మన శరీరంలో ఉండే నీటిస్థాయుల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆ భర్తీని పూర్తి చేస్తూ, చర్మం తాజాగా కనిపించేలా చేయడానికి వీలైనంత అధిక మొత్తంలో నీళ్లు తాగుతూ ఉండాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి కూడా తీసుకోవచ్చు.
- చాలామందికి గోరువెచ్చని లేదా వేడినీళ్లతో స్నానం చేసే అలవాటు ఉంటుంది. అయితే వేసవిలో మాత్రం చల్లని నీటితో స్నానం చేయడం చాలా మంచిదని నిపుణుల చెబుతున్నారు. అలా చేయడం వల్ల అధిక చెమట నుంచి ఉపశమనం లభించడమే కాకుండా చర్మం పొడిబారడం, చిన్న చిన్న పగుళ్లు మొదలైన సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.
- తాజా పండ్లు, కూరగాయలు అధికంగా ఉండేలా డైట్ రూపొందించుకోవాలి. ఫేషియల్ స్ప్రేను ఉపయోగించాలి. క్లెన్సింగ్- టోనింగ్- మాయిశ్చరైజింగ్ ప్రక్రియను తప్పకుండా అనుసరించాలి.