ఉక్రెయిన్ ప్రజలు 'ఘోస్ట్ ఆఫ్ కీవ్'గా పిలుచుకునే యుద్ధ వీరుడు మేజర్ స్టెపాన్ తారాబల్కా(29) దుర్మరణం పాలయ్యాడు. రష్యా సేనలతో పోరాడుతున్న క్రమంలో వారి దాడిలో మృతి చెందాడు. మార్చి 13 ఈ ఘటన జరిగినట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. రష్యాతో యుద్ధం ప్రారంభమైన తర్వాత వారికి చెందిన 40 ఫైటర్ జెట్లను తారాబల్కా ఒక్కడే కూల్చేశాడు. దీంతో రష్యా సేనల్లో కలవరం మొదలైంది. ఈ క్రమంలో అతడు ప్రయాణిస్తున్న మిగ్-29 యుద్ధ విమానాన్ని మార్చి 13న రష్యా విమానాలు చుట్టుముట్టాయి. వారితో జరిగిన పోరాటంలో తారాబల్కా తుది శ్వాస విడిచాడు.
యుద్ధం ప్రారంభమైన తొలిరోజునే ఆరు రష్యన్ విమానాలను తారాబల్కా కూల్చేశాడు. దీంతో అతడిని ఉక్రేనియన్లు "సంరక్షక దేవదూత"గా ప్రశంసించారు. అయితే యుద్ధం కారణంగా అతడి వివరాలను ఉక్రెయిన్ ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. అతడి మరణం గురించిన సమాచారం వారి కుటుంబానికి ఉక్రెయిన్ అధికారులు వెంటనే తెలియజేయలేదు. తారాబల్కా చనిపోయిన తర్వాతే అతడి గొప్పదనం ప్రపంచానికి వెల్లడైంది. ఇక మరణించిన తర్వాత అతడి భౌతిక కాయంపై ఉక్రెయిన్ పతాకాన్ని కప్పారు. ది ఆర్డర్ ఆఫ్ ది గోల్డెన్ స్టార్ అనే ఉక్రెయిన్ అత్యున్నత బిరుదును అతడికి ప్రకటించారు. తారాబల్కాకు భార్య ఒలెనియా, ఎనిమిదేళ్ల కుమారుడు యారిక్ ఉన్నారు.