దిశ యాప్‌తో మహిళలకు అదనపు భద్రత లభిస్తుందని మంత్రి, వైయస్ఆర్‌సీపీ అనంతపురం రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మహిళల భద్రత విషయంలో ఏపీ సర్కారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దిశ యాప్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని శనివారం అనంతపురం నగరంలోని చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం లో ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, రీజనల్ ఇన్‌చార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ఉషాశ్రీ చరణ్, పార్లమెంటు సభ్యులు ఎన్.రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, ఎం.ఎస్.బాబు,జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్,తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దిశ చట్టం అమల్లోకి తేవడంతో పాటు దిశ యాప్‌ని కూడా రూపొందించామన్నారు. 2020 ఫిబ్రవరిలో ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఆపిల్ ఫోన్లలలో అందుబాటులోకి తెచ్చారు. దిశ యాప్ ద్వారా వచ్చిన కాల్స్, మేసేజ్‌లకు సంబంధించి ఇప్పటి వరకు 850 పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇందులో 160 సందర్భాల్లో ఎప్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇంచుమించు వెయ్యి మంది మహిళలు, అమ్మాయిలను ప్రమాదాల బారి నుంచి దిశ యాప్ రక్షించింది. దీంతో రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో స్వయంగా సీఎం వైయస్ జగన్ దిశ యాప్ అవగాహన సదస్సులో పాల్గొని ప్రతీ ఒక్క మహిళ చేత ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా చైతన్యవంతం చేశారన్నారు.