రేపల్లే రైల్వే స్టేషన్ అత్యాచార ఘటనలో ఏ తల్లి తప్పు ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విచిత్రంగా ఉం దని విమర్శించారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో భర్తను దారుణంగా కొట్టి, అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీనిపై జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో మహిళా వలస కూలీపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన ఏపీలో దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిని తెలియజేస్తోందని వెల్లడించారు.
గత పది రోజులుగా రాష్ట్రంలో వరుసగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని, కానీ సీబీఐ దత్తపుత్రుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ స్పందించడంలేదని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. బాధిత కుటుంబాలపైనే నిందలు వేసి తప్పించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండడం గర్హనీయమని పేర్కొన్నారు. తుమ్మపూడి ఘటనలో పోలీసుల తీరే అందుకు నిదర్శనమని వివరించారు.
రాష్ట్ర హోంమంత్రి ప్రకటనలు సైతం ప్రభుత్వం తీరును వెల్లడిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనలకు తల్లులే కారణమని, వాళ్లు సరిగా లేకపోవడమే కారణమని చెప్పడం విచిత్రంగా ఉందని నాదెండ్ల అభిప్రాయపడ్డారు. రేపల్లె సామూహిక అత్యాచార ఘటనలో ఏ తల్లి తప్పు ఉంది? అని నిలదీశారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారానికి ఏ తల్లి తప్పిదమో బాధ్యత కలిగిన హోంమంత్రి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ అత్యాచార ఘటనపై స్పందించిన తీరు చూశాక రాష్ట్ర హోంమంత్రి అవగాహనా రాహిత్యం వెల్లడైందని విమర్శించారు.
హోంశాఖను, పోలీసులను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఫలితంగా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి లేకుండా చట్టాలు చేసి ప్రచారం చేసుకోవడం వల్ల ఏ ఒక్క ఆడబిడ్డకు భరోసా లభించదని అభిప్రాయపడ్డారు. తాడేపల్లి ఇంటి నుంచి బయటకు కదలని సీఎం ఓసారి బయటకు వచ్చి బాధిత కుటుంబాలతో మాట్లాడితే ఆడపిల్లల తల్లిదండ్రులలో ఉన్న భయాందోళనలు తెలుస్తాయని నాదెండ్ల మనోహర్ హితవు పలికారు.
రాష్ట్రంలోని కీచకపర్వాన్ని ఖండించే ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల వారిని కట్టడి చేసి, అరెస్టులు చేయడం మాని మహిళల రక్షణపై చిత్తశుద్ధితో పనిచేయాలని స్పష్టం చేశారు. రేపల్లె అత్యాచార ఘటన బాధితురాలు నాలుగు నెలల గర్భవతి అని తెలిసిందని, ఆమె ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa