తూర్పు గోదావరి జిల్లా: గోకవరం మండలంలోని అచ్యుతాపురం గ్రామస్తులు చేపట్టిన ఉద్యమానికి ఫలితం లభించింది. గ్రామం మీదుగా విద్యుత్ లైన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు, జనసేన జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర దంపతులు నాలుగు రోజులుగా కనకదుర్గమ్మ ఆలయంలో చేపట్టిన నిరవధిక దీక్షకు ఆదివారం తెరపడింది.
గ్రామం మీదుగా కాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో (పొలాల ద్వారా) విద్యుత్ స్తంభాలు వేసేందుకు విద్యుత శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శామ్యూల్ ఆందోళనకారులకు లిఖితపూర్వకంగా హామీనిచ్చారు. దీంతో దీక్ష విరమిస్తున్నట్టు గ్రామస్తులు ప్రకటించారు. గ్రామం మీదుగా ఇప్పటివరకు ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాల పరికరాలను కూడా సంబంధింత అధికారులు తొలగించారు. దీక్షాపరులకు జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.