ఓ వ్యక్తి ఒకే వేదికపై ముగ్గురు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు. 15 ఏళ్లుగా ఆ ముగ్గురితో అతడు సహజీవనం చేస్తున్నాడు. వారికి ఆరుగురు పిల్లలున్నారు. వారు కూడా ఈ వివాహ వేడుకలో పాల్గొనడం విశేషం. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పుర్ జిల్లాలో జరిగింది.
అలిరాజ్‌పుర్ జిల్లాకు చెందిన సమర్థ్ మౌర్య(42) గతంలో సర్పంచిగా పనిచేశారు. 15 ఏళ్లుగా అతను ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడు. ఇప్పటికే వారికి ఆరుగురు పిల్లలున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గిరిజన సంప్రదాయం ప్రకారం ఒకే వేదికపై ఆ ముగ్గురిని సమర్థ్ పెళ్లి చేసుకున్నాడు. వారి ఆరుగురు పిల్లలు కూడా ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.
2003లో తన మొదటి భాగస్వామితో పరిచయం ఏర్పడిందని, 15 ఏళ్లుగా మరో ఇద్దరితో కలిసి ఉంటున్నానని మౌర్య తెలిపాడు. ఏప్రిల్ 30న ఒకే మండపంలో నాన్‌బాయి, మేళా, సక్రీలను మౌర్య పెళ్లి చేసుకున్నాడు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.