దేశంలో ఉన్న నారసింహ క్షేత్రాలలో అతి పాచీనమైనది విశాఖపట్టణం జిల్లాలోని సింహాచలం క్షేత్రం. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణానికి 11 కి. మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది.
వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి:
ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది.
సింహాచలం అంటే సింహం యొక్క అవతారం:
సింహం యొక్క పర్వతము సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తున్నది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలిశాడు.
స్వామిలోని ఉష్ణాన్ని తగ్గించేందుకు:
స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు. వరాహము నరుడు, సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో వరాహము తల సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది.
గర్భగుడికి ఎదురుగా కప్పస్తంభం:
కప్ప స్తంభం దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారములో కప్ప స్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్ఠితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభమును కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.
సింహాచలం ఆలయం చేరుకోవడం ఎలా?
వైజాగ్ విమానాశ్రయం నుండి 11 కి. మీ. , వైజాగ్ రైల్వే స్టేషన్ నుండి 11 కి. మీ. , వైజాగ్ బస్ స్టాండ్ నుండి 12 కి. మీ. ల దూరంలో సింహాచలం కలదు. వైజాగ్ నుండి ప్రతిరోజూ పదుల సంఖ్యలో క్యాబ్ లు, ఆటోలు, ప్రభుత్వ బస్సులు, సిటీ బస్సులు సింహాచలానికి వెళుతుంటాయి.