మే నెల 6వ తేది నుండి 24వ తేది వరకు నిర్వహించు ఇంటర్ పరీక్షలకు పటిష్టవంతమైన ఏర్పాట్లు చేయాలని, అన్ని పరీక్ష కేంద్రాల్లో సిసికెమెరాలు ఏర్పాటు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు నియమితులైన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్స్, సంబంధిత అధికారులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల నిర్వహణలో నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా పరీక్షలు నిర్వహంచాలని అన్నారు. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు జిల్లాలో సజావుగా జరుగుతున్నాయని, అయితే కొన్ని జిల్లాల్లో జరిగిన సంఘటనలు కలెక్టర్ గుర్తు చేస్తూ ఇంటర్ పరీక్షలకు ఎలాంటి అవాంతరాలు జరుగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.
ఏదైన చిన్న సంఘటన జరిగితే అందరు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. పరీక్షల నిర్వహణకు నియమించబడిన ప్రతి అధికారి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ముందుగా మీరు నిర్వర్తించవలసిన విధులపట్ల పూర్తి అవగాహనతో ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, పర్నిచర్ వంటి మౌలిక వసతుల గురించి, ప్రతి కేంద్రంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారా లేదా చెక్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నిబంధనల ప్రకారం మొబైల్ ఫోన్లు చీఫ్ సూపరింటెండెంట్లు మినహా మిగత ఎవ్వరి వద్ద ఉండకూడదని అన్నారు. నేటి నుండి రోజువారి నిధుల నిర్వహణ చార్టు సిద్ధం చేసుకొని దానిని అనుసరించాలని అన్నారు.
కరోనా వల్ల రెండేళ్లు గ్యాప్ వచ్చిందని, కావున అందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్ఐవోరవి కుమార్ మాట్లాడు తూ జిల్లాలో ఇంటర్ విద్యార్థులు మొదటి సంవత్సరం 22, 927 మంది, రెండవ సంవ త్సరం 21, 149 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. మొత్తం 62 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి 1200 మంది ఇన్విజిలేటర్లను, 62 మంది చీఫ్ సూపరింటెం డెంట్లు, 62 మంది డిపార్టుమెంట్ల అధి కారులు, 2 ఫ్లయింగ్ స్వ్కాడ్, 3 సిట్టింగ్ స్వాడ్లను నియమించామన్నారు.