ఏపీలో వైసీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది అంటున్నారు అక్కడ ప్రజలు. ఒకరేమో చంపుతామని మహిళా ఎస్ఐకి ఫోన్లో బెదిరిస్తే.. మరొకరేమో ఏకంగా తాను చెప్పినట్లు విననందుకు సచివాలయ ఉద్యోగిపై దాడి చేశాడు. అధికార మదంతో వైసీపీ శ్రేణులు చెలరేగిపోతున్నారు. గత నెల 25న నంద్యాలకు చెందిన రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని వైసీపీ నేత సాయినాథ్ రెడ్డి కబ్జా చేశాడు. దీనిపై స్పందన కార్యక్రమంలో బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. భూ కబ్జాలపై విచారణ చేపట్టాలని మూడవ పట్టణ మహిళా ఎస్ఐకు జిల్లా ఎస్పీ ఆదేశించారు. దీంతో ఆమె వైసీపీ నేత సాయినాథ్ రెడ్డికి ఫోన్ చేశారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్కు రావాలన్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆయన ఎస్ఐపై బూతులతో చెలరేగిపోయాడు. ‘నన్నే పోలీస్ స్టేషన్కు పిలుస్తారా? నీకు ఎంత ధైర్యమంటూ..’ మహిళా ఎస్ఐపై సాయినాథ్ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు. అంతటితో ఆగని వైసీపీ మూక.. ఎస్ఐను బెదిరించారు. దీంతో ఎస్ఐ తన విధులకు ఆటంకం కలిగించాడని, బెదిరింపులకు దిగాడని ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో.. సాయినాథ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు వైసీపీ మూకను కేసు నుంచి రక్షించేందుకు కొంతమంది స్థానిక వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.