అది ప్రయాణికులతో కిక్కిరిసిన ట్రైన్. ఓ స్టేషన్ నుంచి ఆ ట్రైన్ ఎంతకీ కదలకపోవడంతో ప్రయాణికులందరికీ అనుమానం వచ్చింది. ఏం జరిగిందని ఆరా తీస్తే వారికి షాకింగ్ న్యూస్ తెలిసింది. ట్రైన్ నడిపే లోకో పైలట్ లేడని తెలుసుకుని వారంతా నివ్వెరబోయారు. ఆ తర్వాత పోలీసుల వరకు విషయం చేరడంతో అసలు విషయం తెలిసి అంతా అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వివారలిలా ఉన్నాయి.
బీహార్‌లోని సమస్టిపూర్ రైల్వే డివిజన్ హసన్పూర్ స్టేషన్ వద్ద ఓ ట్రైన్ సోమవారం గంటకు పైగా ఆగిపోయింది. తొలుత మరో ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను పోనిచ్చేందుకు ఆ ట్రైన్‌ను ఆపారు. అయినప్పటికీ కదలకపోవడంతో ప్రయాణికులు విసుగు చెందారు. విషయం తెలుసుకునేందుకు అధికారులు ఇంజిన్ వద్దకు వెళ్లగా లోకో పైలట్ కనిపించలేదు. అసిస్టెంట్ లోకోపైలట్ కరణ్వీర్ యాదవ్ ఇంజిన్ నుండి అదృశ్యమయ్యాడు. రైలు సిగ్నల్ ఇచ్చినా కదలడం లేదని, అతడు ఎక్కడ ఉన్నాడోనని అంతా హైరానా పడ్డారు. చివరికి మందు తాగి, మత్తులో ఊగుతున్న స్థితిలో జీఆర్పీ పోలీసులకు అతడు కనిపించాడు. ఉన్నతాధికారుల సూచనతో అతడిని జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై డివిజనల్ రైల్వే మేనేజర్ అలోక్ అగర్వాల్ విచారణకు ఆదేశించారు.