పదవతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో హిందీ, ఇంగ్లీష్, లెక్కల ప్రశ్నాపత్రాలు లీకయినట్లు తెలుస్తోందన్నారు. లీకేజీలకు కారకులుగా భావిస్తూ 13 మందిని అరెస్టు చేశారన్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం ప్రశ్నపత్రాలు లీకేజీ కాలేదని చెబుతున్నారని మండిపడ్డారు. 10వ తరగతి ప్రశ్నా పత్రాలు లీకేజీ కానప్పుడు 16 మందిని ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అటు విద్యార్థులను, ఇటు తల్లిదండ్రులను గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి అంశంలోనూ విఫలమవుతూనే ఉందని తెలిపారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేని ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమా అంటూ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.