ఇటీవల అరెస్ట్ అయిన ఎంపీ నవనీత్ కౌర్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. మహారాష్ట్ర సీఎం ఇంటి ముందు హనుమాన్ ఛాలీసా పఠిస్తానంటూ వ్యాఖ్యలు చేసిన అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కాసేపటి క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. గడచిన 10 రోజులుగా బైకుల్లా జైలు ఉంటున్న నవనీత్ కౌర్‌కు బుధవారమే ముంబై సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం బెయిల్ రాగా... కోర్టు తీర్పు కాపీలు జైలు అధికారులకు అందడంలో జరిగిన ఆలస్యంతో బెయిల్ వచ్చిన మరునాడు నవనీత్ కౌర్ జైలు నుంచి విడుదయ్యారు.
బైకుల్లా జైలు నుంచి విడుదలైన నవనీత్ కౌర్‌ను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు లీలావతి ఆసుపత్రికి తరలించారు. హనుమాన్ జయంతి రోజున సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ ఛాలీసా పఠించాలని డిమాండ్ చేసిన కౌర్... సీఎం అందుకు ఒప్పుకోకపోతే ఆయన ఇంటి ముందు తానే హనుమాన్ ఛాలీసా పఠిస్తానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్యలు శివసేన శ్రేణులను ఆగ్రహావేశాలకు గురి చేయగా..వారంతా కౌర్ ఇంటి ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా ముంబైలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కౌర్‌తో పాటు ఎమ్మెల్యేగా ఉన్న ఆమె భర్త రవి రాణాను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కౌర్‌తో పాటు రవి రాణాకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.