కరోనా వైరస్ ఇంకా శాంతించకపోవడంతో ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు జరగాల్సి ఉన్న ఏషియన్ గేమ్స్ నిరవధికంగా వాయిదా పడ్డాయి. చైనాలోని హాంగ్ఝూలో నిర్వహించాల్సి ఉన్నా.. ప్రస్తుతం అక్కడ కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. కోట్లాది మంది ప్రజలు లాక్ డౌన్ లో ఉండిపోయారు. ఆహారం దొరక్క అలమటించిపోతున్నారు. మానసికంగానూ సమస్యలను ఎదుర్కొంటున్నారు.
అయితే, చైనాలో పరిస్థితులు ఇప్పట్లో నియంత్రణలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో.. 19వ ఏషియన్ గేమ్స్ ను వాయిదా వేస్తున్నట్టు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని చెప్పింది. గత నెలలోనే అన్ని ఈవెంట్లకు సంబంధించి హాంగ్ఝూలో 56 పోటీ వేదికలను నిర్మించామని ఏషియన్ గేమ్స్ నిర్వాహకులు చెప్పారు. వాస్తవానికి కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా.. అన్ని చర్యలూ తీసుకుంటూ నిర్వహిస్తామని అంతకుముందు నిర్వాహకులు ప్రకటించినా.. ఇప్పుడు మాత్రం వెనక్కు తగ్గారు.