రైతులకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ అందించారు. మే 16న రైతులకు రైతు భరోసా సాయాన్ని అందజేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. వ్యవసాయ శాఖపై అధికారులతో సమీక్ష తర్వాత తీసుకున్న నిర్ణయాలను ఆయన తెలిపారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పారు. జూన్ 15లోగా రైతులకు నష్ట పరిహారం అందజేస్తామని తెలిపారు.
ఈ నెల 11న అర్హులైన మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో మత్స్యకార భరోసా సాయాన్ని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక 4,014 కమ్యూనిటీ సెంటర్లలో 3 వేల ట్రాక్టర్లతో సహా సాగు పనిముట్లను రైతులకు అందజేస్తామని, జూన్ మొదటి వారంలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. ఇదిలా ఉండగా రైతులు వినియోగించే సాగు నీటికి సంబంధించి బోర్లకు మీటర్లు పెట్టే పైలట్ ప్రాజెక్టు శ్రీకాకుళంలో విజయవంతమైనట్లు సీఎం చెప్పారు. ఈ విధానంతో 30 శాతానికి పైగా విద్యుత్ ఆదా అయిందని వివరించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సాగు బోర్లకు మీటర్లు పెట్టనున్నట్లు ప్రకటించారు.