ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునేందుకు రష్యా చేపట్టిన సైనిక చర్య దారుణ పరిణామాలకు కారణమైంది. ఉక్రెయిన్‌లోని పలు నగరాలు స్మశానాలను తలపిస్తున్నాయి. మరోవైపు రష్యాకు కూడా ఉక్రెయిన్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. ఉక్రెయిన్ ఎదురు దాడుల్లో రష్యాకు తీరని నష్టం వాటిల్లుతోంది. ఇప్పటి వరకు రష్యాకు చెందిన 25 వేల సైనికులను హతమార్చామని ఉక్రెయిన్ ప్రకటించింది. యుద్ధం ప్రారంభమైన 72 రోజుల్లో రష్యాకు చెందిన 1100కుపైగా యుద్ధ ట్యాంకులు, 199 యుద్ధ విమానాలు, 2,686 సైనిక వాహనాలు, 155 హెలికాప్టర్లు, 502 ఆర్టిలరీ వ్యవస్థలు, 1,900 ఇతర వాహనాలను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ విదేశాంక శాఖ వెల్లడించింది. దీనిపై ఉక్రెయిన్ విదేశాంగ శాఖ శుక్రవారం ట్విట్టర్‌లో వివరాలను పేర్కొంది.
తమకు ఎంత నష్టం వాటిల్లుతున్నా ఉక్రెయిన్‌పై రష్యా ఎడతెరపి లేకుండా దాడులు చేస్తోంది. మరియుపోల్ నగరంలోని అజోవ్‌స్టల్ స్టీల్ ప్లాంట్ వద్ద ఇరు సైన్యాల మధ్య భీకర పోరు సాగుతోందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ సరిహద్దులోని పోలాండ్ దేశం వల్ల తమకు ముప్పు ఉందని రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ శుక్రవారం ఆరోపించారు. పోలాండ్ అధికారులు చేస్తున్న శృతి మించుతున్నాయని హెచ్చరించారు. ఇటీవలే రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని అంతర్జాతీయ దేశాలను పోలాండ్ కోరింది. ఇదే రష్యా ఆగ్రహానికి కారణమైంది.